: బీరు తాగిన విషయాన్ని దాచేందుకు కిడ్నాప్ కథ అల్లింది!
కాలానుగుణంగా నేటి యువతలో విపరీత మార్పులు కనిపిస్తున్నాయి. టీనేజర్లు విచ్చలవిడిగా మద్యపానం చేయడం చూస్తున్నాం. అమ్మాయిలు కూడా తాము అబ్బాయిలకేమీ తీసిపోమన్నట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఢిల్లీలో ఓ పదిహేనేళ్ళ అమ్మాయి తన కజిన్ తో కలిసి బీరు పార్టీకి వెళ్ళిన విషయాన్ని తల్లిదండ్రుల వద్ద దాచే క్రమంలో ఏం చేసిందో చూడండి! తనను ఎవరో కిడ్నాప్ చేశారని, బలవంతంగా మద్యం తాగించారని కన్నవారికి ఫోన్ చేసి చెప్పింది. అది నిజమేనని నమ్మిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఈ అమ్మాయి ఓరోజు స్కూల్ కు బయల్దేరింది. కానీ, స్కూల్ కు వెళ్ళకుండా రెస్టారెంటు బాటపట్టింది. ఆమె తన కజిన్ అయిన మరో అమ్మాయితో కలిసి అంతకుముందే బీర్ పార్టీకి ప్లాన్ చేసింది. నోయిడా వెళ్ళి అక్కడ తన కజిన్ ను కలిసింది. వారిద్దరూ మరో అబ్బాయితో జతకూడి ఓ రెస్టారెంట్లో బీర్లు పొంగించారు. పార్టీ ముగిసిన తర్వాత సదరు కజిన్ ఆ బాలికను అక్షర్ ధామ్ రైల్వే స్టేషన్ వద్ద విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ స్టేషన్ వెలుపల కూర్చున్న అమ్మాయికి భయం వేసింది. తాగిన విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఎలా అనుకుంటూ, ఓ కథ అల్లేసింది. ఘిత్రోని రైల్వే స్టేషన్ నుంచి స్కూల్ కు వెళ్ళే క్రమంలో తనను ఎవరో మహీంద్రా స్కార్పియోలో బలవంతంగా తీసుకువెళుతున్నారంటూ వారికి ఫోన్ చేసింది. ఆమె తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను అక్షర్ ధామ్ రైల్వే స్టేషన్ వద్ద కనుగొన్నారు. ఆ బాలిక చెప్పిన కథ ఆధారంగా ఘిత్రోని రైల్వే స్టేషన్ వద్ద సీసీటీవీ ఫుటేజిని పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ టీనేజర్ అక్కడి బాత్రూంలోకి స్కూల్ యూనిఫాంతో వెళ్ళి, క్యాజువల్ డ్రెస్ తో తిరిగి రావడం ఆ ఫుటేజిలో కనిపించింది. దీంతో, కాస్త కటువుగా ప్రశ్నించడంతో బాలిక బీరు పార్టీ వివరాలు పొల్లుపోకుండా చెప్పేసింది.