: చంద్రబాబు పరీక్ష పెట్టారు ... ఇద్దరే పాస్, మిగతా మంత్రులు ఫెయిల్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ద్వైమాసిక పరీక్ష పెట్టారు. ఆయన పెట్టిన పరీక్షలో కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే అత్తెసరు మార్కులతో పాసయ్యారు. మిగతా వారందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వివరాల్లోకి వెళితే మంత్రులు పనితీరును బట్టి వారికి విద్యార్థులకు ఇచ్చినట్టు రేటింగ్స్ ఇస్తానని ప్రమాణస్వీకారం చేసిన కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు ప్రకటించారు. చెప్పినట్టుగానే రెండు నెలల పూర్తవగానే... మంత్రులందరూ ఈ రెండు నెలల్లో ఏయే పనులు, ఎలా చేశారో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. మంత్రులు తమ నివేదికను సమర్పించారు. దీంతో సరిపెట్టుకోకుండా మంత్రుల పనితీరుపై తన సొంత టీంతో నివేదికలు తెప్పించుకున్నారు. ఈ రెండు నివేదికలు సరిచూసుకుని చంద్రబాబు మంత్రులందరికీ మార్కులు వేసి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. చంద్రబాబు పెట్టిన పరీక్షలో కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే పాసయ్యారు... అది కూడా బొటాబొటి... 38 మార్కులతో. మిగిలిన 17 మంది మంత్రులు 13 నుంచి 15 మార్కులు మధ్య తెచ్చుకుని ఘోరంగా తప్పారు. అయితే ఏ మంత్రికి ఎన్ని మార్కులొచ్చాయో చంద్రబాబు పేరుపేరునా వెల్లడించలేదు. మంత్రుల పనీతీరుతో పాటు ఎమ్మేల్యేల పనితీరుపై కూడా ఆయన సమీక్షించారు. ఎమ్మెల్యేల పనితీరు కూడా ఆయనకు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించలేదు. ఈ ఫలితాలతో తీవ్ర అసంతృప్తి చెందిన చంద్రబాబు... మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఇలాగే కొనసాగితే ప్రజలు పెట్టే పరీక్షల్లో కూడా ఫెయిల్ అవ్వడం ఖాయమని వారికి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే... వారి పనితీరును మెరుగుపరిచేందుకు ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే, ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 13 జిల్లాల నుంచి వచ్చే టీడీపీ ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాలు, పరిపాలనా విధానం, సమస్యలను చూసే పద్ధతి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై ఈ రోజు శిక్షణ ఇవ్వనున్నారు. రాబోయే రోజుల్లో పనితీరును మెరుగుపరుచుకోకపోతే... ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత పెద్దవారైనప్పటికీ ఉపేక్షించేది లేదని చంద్రబాబు అందరికీ స్పష్టం చేసినట్టు సమాచారం.