: ఆర్టీసీని రిలయన్స్ సంస్థకు అమ్మేందుకు సిద్ధమవుతోన్న ఏపీ ప్రభుత్వం!
ఏపీఎస్ ఆర్టీసీని రిలయన్స్ కు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి గతేడాది రాష్ట్రం విభజన కాకముందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు రిలయన్స్ సంస్థ ఏపీఎస్ ఆర్టీసీని టేకోవర్ చేసుకునే ప్రతిపాదన ఉంచింది. ఆర్టీసీని తమకు అప్పగిస్తే రవాణా వ్యవస్థను మెరుగుపరిచి లాభాల బాట పట్టిస్తామని అప్పటి ప్రభుత్వం ముందు రిలయన్స్ ప్రతిపాదించింది. ఐతే, అప్పడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రిలయన్స్ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత రిలయన్స్ ప్రతిపాదనకు మళ్లీ రెక్కలొచ్చాయి. రిలయన్స్ ప్రపోజల్ కు తాజాగా ఏపీలోని టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ సర్కార్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకటి ఆర్టీసీని ఎలాగోలా ప్రభుత్వమే నిర్వహించడం. రెండోది రిలయన్స్ లాంటి ప్రైవేటు సంస్థలకు అప్పగించడం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రెండో ప్రతిపాదనవైపే మొగ్గు చూపిస్తోందని సమాచారం. ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ లో నెలకు 100 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. విభజన తర్వాత రాష్ట్ర ఆర్థికపరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో... ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని వదిలించుకోవడమే మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిందని విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి, రిలయన్స్ వర్గాలకు చురుగ్గా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో రిలయన్స్ పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఆర్టీసీలో 70వేల మంది ఉద్యోగులు ఉన్నారు...వారిలో 30 వేలమంది డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నీషియన్లు ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్...క్లరికల్ సిబ్బంది కలిపి మరో నలభై వేల దాకా ఉన్నారు....వీరిలో 30 వేల మంది ఉన్న డ్రైవర్లు, కండక్లర్లు, టెక్నీషయన్లను మాత్రం తామే తీసుకుంటామని రిలయన్స్ ప్రతిపాదించింది. అడ్మినిష్ట్రేషన్ వ్యవహారాలు చూస్తోన్న మిగతా 40 వేల మందిని తీసుకునేందుకు రిలయన్స్ సుముఖత చూపడం లేదు. అలాగే ప్రస్తుతం 12 వేల జీతం ఇస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు 25 వేల వరకు పెంచుతామని రిలయన్స్ స్పష్టం చేసింది. రిలయన్స్ ప్రతిపాదనకు ఒప్పుకుంటే 40 వేలమంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. సగటున ఒక్కొక్క ఉద్యోగికి సగటున పది లక్షల చొప్పున ఇచ్చినా... మొత్తం 40 వేల మందికి 350 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుంది. ఆర్టీసీ టేకోవర్ చేసుకునేందుకు రిలయన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ....ఇరుపార్టీల మధ్య జరిగే అవగాహన (మెమెరాండమ్ ఆప్ అండర్ స్టాండింగ్) ఒప్పందమప్పుడు ఖరారు అవుతుందని అధికారులు చెబుతున్నారు.