: ‘మిషన్ కాశ్మీర్’పై అమిత్ షా గురి!
కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అధికార పగ్గాలు దక్కడంలో కీలక భూమిక పోషించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ‘మిషన్ కాశ్మీర్’పై దృష్టి సారించారు. మిషన్ కాశ్మీర్... అంటే, ఏదో మిలిటరీ ఆపరేషన్ లా ఉందేమిటనుకుంటున్నారా? అదేం లేదు కాని, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ నేతను కూర్చోబెట్టాలన్న పార్టీ లక్ష్యానికి ఆ పేరు పెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో పార్టీ అసమాన రీతిలో విజయం సాధించింది. దీనికి అమిత్ షా పక్కాగా రచించిన ప్రణాళికే కారణమన్న విషయం తెలిసిందే. పార్టీకి పట్టులేని ఇతర రాష్ట్రాల్లో బలమైన పునాదులు నిర్మించేందుకు అమిత్ షా కంకణం కట్టుకున్నారు. రానున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో వీలయినన్ని మెజార్టీ సీట్లను చేజిక్కించుకునేందుకు అమిత్ షా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాశ్మీరీ పండిట్లను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు, నిలకడ లేని వారిని పార్టీ నుంచి సాగనంపేందుకు కూడా అమిత్ షా కార్యరంగాన్ని సిద్ధం చేశారు. నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలను, నేతలను సంపాదించుకున్న పార్టీకి ప్రజాక్షేత్రంలో తిరుగుండదన్నది అమిత్ షా నమ్మకం. ఆ దిశగానే ఆయన అడుగులేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలోని 88 సీట్లలో 33 స్థానాల పరిధిలో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత లభించింది. ఇదే పరిస్థితి పునరావృతమైతే, ఆ 33 సీట్లు బీజేపీ ఖాతాలో పడినట్లే. ఇంకో పది సీట్లను కైవసం చేసుకునే దిశగా చర్యలు చేపడితే, జమ్మూ, కాశ్మీర్ లో అధికార పగ్గాలు దక్కించుకోవడం అంత కష్టమేమీ కాదన్నది అమిత్ షా అభిప్రాయం. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో బీజేపీకి 11 మంది సభ్యుల బలం ఉంది.