: ఇదేం వింత?... విశాఖలో కొత్త పంథా
బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేయాలంటే అధికారులు నోటీసులిస్తారు. వినకపోతే సరఫరా కట్ చేస్తారు. ఇంకా మొండికేస్తే కోర్టుకెళ్తారు. కానీ విశాఖలో పన్ను బకాయిలు చెల్లించాలంటూ అధికారులు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా పన్నులు చెల్లించకపోతే రిలేనిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. లక్ష్మీపురం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ) గోడౌన్ల వద్ద గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) రెవెన్యూ అధికారులు ఆందోళన చేపట్టారు. ఎఫ్సిఐ 2 కోట్ల రూపాయల ఆస్తి పన్ను ఎగవేసిందని అధికారులు నిరసన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించేవరకు రిలే దీక్షలు చేస్తామని జీవీఎంసీ రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. పన్నులు ఎగవేసినందుకు రెవెన్యూ అధికారులు నిరసన తెలపడం, బకాయిల కోసం రిలేదీక్ష చేస్తామని హెచ్చరించడం వింతే.