: పాకిస్థాన్ మరోసారి సైన్యం చేతుల్లోకి వెళ్ళనుందా?
పాకిస్థాన్ లో ప్రస్తుతం ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యతిరేక పవనాలు గట్టిగా వీస్తున్నాయి. విపక్ష తెహ్రీకే ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్, మతగురువు తాహిర్ ఉల్ ఖాద్రీ... షరీఫ్ దిగిపోవాల్సిందేనంటూ ఇస్లామాబాదులో వేలాది మందితో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం చూస్తుంటే... పాకిస్థాన్ లో మరోసారి మిలిటరీ పాలనకు అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతున్నట్టు అర్థమవుతోంది. తాజా పరిస్థితులపై సైన్యం ఏమనుకుంటోందన్న విషయమై కిందటి వారం ఆయన ఇద్దరు దూతలను ఆర్మీ చీఫ్ వద్దకు పంపారు. ఇమ్రాన్, తాహిర్ ల ఉద్యమాలను సైన్యం నిశితంగా పరిశీలిస్తోందా? లేక, ఒకవేళ తిరుగుబాటుకు సిద్ధమవుతోందా? అని తన దూతల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాగా, షరీఫ్ అనుయాయులతో ఆర్మీ చీఫ్ భేటీని సైనిక మీడియా విభాగం కొట్టిపారేసింది. తాజా సంక్షోభంపై మిలటరీ ప్రతినిధి జనరల్ అసీం బాజ్వా నిరసనకారులనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకముంచాలని, అర్థవంతమైన చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పాక్ లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, ఇమ్రాన్, తాహిర్ ల ఉద్యమాలు నానాటికి బలపడుతున్న తరుణంలో, సైన్యం సహకరించకపోతే మాత్రం షరీఫ్ బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.