: మరో సంక్షోభం దిశగా పాక్
పాకిస్తాన్ లో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని పార్లమెంట్ వరకు సాగిన ఈ ర్యాలీకి మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్, ఇస్లామిక్ మత గురువు తాహిర్ ఉల్ ఖాద్రీలు నేతృత్వం వహించారు. ఆందోళనకారులను నిలువరించడం పోలీసులకు సాధ్యం కాలేదు. విదేశాంగ కార్యాలయాలు, దేశ ప్రముఖుల నివాస సముదాయాల్లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లకుండా చూసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఆందోళనకారులు మరింత ముందుకు వెళితే సైన్యం రంగంలోకి దిగాల్సి వస్తుందని పాక్ హోం మంత్రి ప్రకటించినా ఫలితం కనిపించలేదు. అనుకున్నట్లుగానే పార్లమెంట్ చేరుకున్న ఆందోళనకారులను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఖాద్రీ కూడా ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గడచిన ఎన్నికల్లో షరీఫ్ రిగ్గింగ్ చేసి విజయం సాధించారని ఆరోపిస్తున్న ఖాన్, పదవిలో కొనసాగే నైతిక హక్కును షరీఫ్ కోల్పోయారని ఆరోపించారు. నిరుద్యోగం, విద్యుత్ కోతలు, తాలిబన్ ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలు తదితరాల నేపథ్యంలో మెజార్టీ ప్రజానీకం కూడా షరీఫ్ ప్రభుత్వంపై విముఖతతో ఉన్నారు. ఇదే సమయంలో ఆందోళన బాట పట్టిన ఇమ్రాన్ ఖాన్ పిలుపుకు భారీ స్పందన లభించింది.