: టీమిండియా కోచ్ ఇక ఇంటికేనా?
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్, కెన్యా వంటి జట్లు చివరి వరకు పోరాడుతాయని, టీమిండియా ఆటగాళ్లు వారికంటే అధ్వానంగా ఆడారని సర్వత్ర విమర్శలు వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో కోచ్ గా డంకన్ ఫ్లెచర్ ను తప్పించడమే మంచిదని మాజీలు స్పష్టం చేస్తున్నారు. దీంతో త్వరలో వెస్టిండీస్ తో భారత్ లో జరిగే సిరీస్ కు టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్ దూరం కానున్నాడని సమాచారం. ఇంగ్లండ్ లో ఘోర వైఫల్యం అనంతరం ఫ్లెచర్ పై విమర్శలు వెల్లువలా చుట్టుముట్టడంతో అతను భారత్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడట. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ కు ఫ్లెచర్ అందుబాటులో ఉండకపోవచ్చని స్వయంగా బీసీసీఐ అధికారి తెలిపారు. ప్రస్తుతం భారత్ జట్టులోని లోపాలను సరిదిద్దేందుకు మాజీ ఆటగాడు రవిశాస్త్రిని టీమిండియా డైరెక్టర్ గా నియమించి, ఫ్లెచర్ పాత్రను తగ్గించడంతో, కినుక వహించిన ఫ్లెచర్, కోచ్ గా కొనసాగేందుకు సిద్ధంగా లేడని సమాచారం. విండీస్ సిరీస్ కు ముందే కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఫ్లెచర్ భావిస్తున్నాడు. దీంతో టీమిండియా కోచ్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నాడని, ఒకవేళ అతను రాజీనామా చేస్తే బోర్డు ఆపే ప్రయత్నం చేయదని ఆ అధికారి వివరించారు.