: భారత భూభాగంలోకి చైనా చొరబాటు
చైనా సైన్యం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మళ్లీ భారత భూభాగంలోకి చొరబడింది. జమ్మూ, కాశ్మీర్ లోని లఢక్ ప్రాంతంలో దాదాపు 25 కిలో మీటర్ల మేర భారత భూభాగంలోకి వచ్చిన చైనా సైన్యం ఏకంగా గుడారాలను వేసుకుని తిష్ట వేసింది. దీనిని గమనించిన భారత సైన్యం వెనక్కెళ్లాలని చేసిన విజ్ఞప్తిని కూడా చైనా సైనికులు పెడచెవిన పెడుతున్నారు. ‘‘ఈ భూభాగం చైనాకు చెందినదే. మీరే వెనక్కి వెళ్లండి’’ అంటూ ప్లకార్డులు చూపిస్తున్నారని భారత సైనికాధికారులు తెలిపారు. అయితే వాస్తవాధీన రేఖపై ఇరు దేశాల భిన్నవాదనల నేపథ్యంలో చొరబాటు జరిగిందని చెప్పలేమని భారత సైన్యం తెలిపింది. ఈ తరహా చర్యలను ఇరుదేశాలు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే, గతేడాది కూడా ఇదే ప్రాంతంలోకి చైనా సైన్యం చొరబడింది. ఆ సందర్భంగా దాదాపు మూడు వారాల పాటు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.