: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు సమావేశాల్లో భాగంగా పోలీసు సంస్కరణ బిల్లును చంద్రబాబు సర్కారు సభలో ప్రవేశపెట్టనుంది. తొలి రోజు సమావేశాల్లో భాగంగా రాజకీయ హత్యలపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వాదులాడుకున్న నేపథ్యంలో రెండో రోజు సమావేశాల్లోనే ఇదే అంశం ప్రధానంగా చర్చకు రానుంది. అయితే ప్రతిపక్ష వైకాపా ఆరోపణలను తిప్పికొట్టేందుకు సర్కారు అన్ని రకాలుగా సన్నద్ధమైందని తెలుస్తోంది. గడచిన పదేళ్లలో రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ హత్యల వివరాలను హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీసుకున్నారు. వైఎస్ హయాంలోనే రాజకీయ హత్యలు విచ్చలవిడిగా జరిగాయని చంద్రబాబు ప్రభుత్వం ఎదురుదాడికి దిగనుందని తెలుస్తోంది. అయితే ఎన్నికల క్షేత్రంలో తమను ఎదుర్కోలేని టీడీపీ, తమ పార్టీ నేతలపై విచక్షణారహితంగా దాడులకు దిగుతోందని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం 8 గంటలకే అసెంబ్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హత్యా రాజకీయాలపై వైకాపాను సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలనూ చంద్రబాబు, తన పార్టీ సభ్యులకు వివరించినట్లు తెలుస్తోంది.