: మెదక్ పార్లమెంట్ బరిలో తెరాస అభ్యర్థి ఎవరో?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఖాళీ చేసిన మెదక్ పార్లమెంట్ నియోజవర్గ ఉప ఎన్నిక బరిలో నిలిచే తెరాస అభ్యర్థి ఎవరన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ కు అవకాశమివ్వాలని టీఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం కేసీఆర్ ను కలిసి, దేవీ ప్రసాద్ అభ్యర్థిత్వంపై చర్చించారు. ఉద్యోగుల వాదనను సావధానంగా విన్న కేసీఆర్, మౌన ముద్ర దాల్చారే తప్పించి వారికేమీ హామీ ఇవ్వలేదట. అయితే ఈ స్థానం నుంచి బరిలోకి దిగే అభ్యర్థిని కేసీఆర్ ముందే నిర్ణయించారని కూడా ప్రచారం సాగుతోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారికి ఈ స్థానాన్ని కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. సంస్కృతి సంప్రదాయాలపై మంచి పట్టున్న రమణాచారి తన సర్వీసులో పలు కీలక పదవులు నిర్వహించారు. అంతేకాక, రాజకీయ పార్టీలతోనూ ఆయన సన్నిహితంగా మెలిగారు. ఇటీవలే పదవీ విరమణ పొందిన రమణాచారిని పార్లమెంట్ కు పంపడం ద్వారా, ఢిల్లీలో రాష్ట్ర వాణిని బలంగా వినిపించే అవకాశాలున్నట్లు తెరాస శ్రేణులు భావిస్తున్నాయి. ఇక గడచిన ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి, ఓటమిపాలైన మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకూ ఈ సీటు దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. చివరి నిమిషంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆయనకు కేసీఆర్ అంతకుముందే హామీ ఇచ్చినట్లు కూడా ప్రచారం సాగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణకు కూడా కేసీఆర్, గడచిన ఎన్నికలకు ముందే ఈ సీటుపై హామీ ఇచ్చారన్న వాదనా వినిపిస్తోంది.