: ద్రౌపదిని శ్రీకృష్ణుడికే ఇద్దామనుకున్నారట, కానీ..!
ఇప్పుడు ఏమోగానీ, పురాణ కాలంలో ప్రతిదీ కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా జరిగిపోయేదని మనకు ఎన్నో గ్రంథాలు చెబుతున్నాయి. అంతా భగవదానుసారమే నిర్ణయించబడేదని ప్రతీతి. మహాభారతంలో అందుకు ఎన్నో దృష్టాంతాలున్నాయి. శ్రీకృష్ణుడు ఎందుకు ద్రౌపదిని వివాహం చేసుకోలేదన్నది వాటిలో ఒకటి. యాదవ వంశోద్ధారకుడిగా దేదీప్యమానంగా వెలుగొందుతూ, ఆ ప్రాభవానికి మరొకరు సాటిరారనిపించుకుంటున్న కాలంలో ఆయన ద్రుపదుడి కుమార్తెను నిరాకరించడం ఆసక్తికరం. అప్పట్లో ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజుకు తన కుమార్తెను ఈ బృందావన విహారికిచ్చి పెళ్ళి చేయాలని కోరికగా ఉండేదట. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశాడు. కృష్ణుడి వంటి జగదేకవీరుడు తన అల్లుడైతే శత్రువైన ద్రోణుడి మదమణచవచ్చన్నది ద్రుపదుడి ఆలోచన. పాపం, మిత్రుడైన ద్రోణుడి చేతిలో పరాభవం ద్రుపద మహారాజును దహించివేస్తోందాయె. కానీ, ఘటనాఘటన సమర్థుడు, సర్వలోక రక్షకుడు అయిన ఆ కృష్ణ భగవానుడు మరోలా తలంచాడు. లోక కల్యాణార్థం జరగాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా. వాటిలో ద్రుపద తనయ వివాహాన్ని కూడా చేర్చేశాడు. ఈ తర్జనభర్జనలు కొనసాగుతున్న తరుణంలోనే ఓ పర్యాయం కృష్ణ పరమాత్ముడు పాంచాల రాజ్యం వెళ్ళాడు. ద్రుపదుడు ఇదే మంచి సమయం అని భావించి మనసులో మాట చెప్పేయగా, గోపాలుడు సున్నితంగా తిరస్కరించాడట. అర్హతల రీత్యా ద్రౌపది ఏమీ తీసివేయదగ్గది కాదని... కానీ, ఆమెకు జతగా తాను మరొకరిని ఎంపిక చేశానని వెల్లడించాడు. దీంతో, ద్రుపదుడిలో కౌతుకం హెచ్చింది. "ఎవరు కృష్ణా ఆ వ్యక్తి.."? అని, ఉత్సుకత నిండిన స్వరంతో అడగగా, అప్పుడు చెబుతాడు శ్రీకృష్ణుడు అర్జునుడి గురించి. అయితే, అర్జునుడు ద్రోణుడి శిష్యుడని చెప్పడంతో ద్రుపదుడి ముఖంలో రంగులు మారడాన్ని గమనిస్తాడు గోవిందుడు. చివరికి కృష్ణుడు చెప్పిన సంబంధం కావడంతో ఇంకేమీ ఆలోచించలేక పెళ్ళికి అంగీకరిస్తాడా పాంచాల రాజు. ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలిసిందే. స్వయంవరంలో అర్జునుడు... పాంచాల రాకుమార్తెను గెలుచుకురావడం... ఫాల్గుణుడు తెచ్చింది ఓ ఫలమని భావించిన తల్లి కుంతి, దాన్ని అన్నదమ్ములందరూ సమంగా పంచుకోమని ఆజ్ఞాపించడం... తద్వారా ద్రౌపది కాస్తా పంచ పాండవులకు భార్య కావడం... మనం చదువుకుని ఉన్నాం. తదనంతర కాలంలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఓ సఖి (నేస్తం)గానూ, ఓ సోదరిగానూ భావించి ఆమెకో విశిష్ట స్థానం అందించాడు. ద్రౌపది కూడా కన్నయ్యను ఓ అన్నయ్యగానే భావించి కడవరకూ ఆరాధించింది. శ్రీకృష్ణుడు ఇచ్చిన సలహాను ఆమె జీవితాంతం మరువలేదు. భర్తల యందు భక్తిప్రపత్తులను ఎన్నడూ విడనాడరాదన్నదే ఆ గీతా ప్రబోధకుడిచ్చిన సలహా.