: త్వరలోనే బయటికి వస్తా: అసాంజే
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తాను త్వరలోనే బయటికి వస్తానంటున్నారు. లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీని వదిలి మరికొన్ని రోజుల్లో వెలుపలికి వస్తానని తెలిపారు. ఈ దౌత్యకార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అసాంజే మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. అంతకుమించి మరే వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం అసాంజే ఆరోగ్యం బాగా దెబ్బతిన్న నేపథ్యంలోనే బయటికి వస్తున్నట్టు తెలుస్తోంది. మెరుగైన చికిత్స పొందేందుకు వీలుగా పోలీసులకు లొంగిపోనున్నాడని కూడా కొన్ని వార్తలు వినవస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, మరికొన్ని ప్రపంచ దేశాలకు చెందిన ఎన్నో రహస్య పత్రాలను తన వికీలీక్స్ వెబ్ సైట్లో పెట్టడం ద్వారా అసాంజే సంచలనం సృష్టించడం తెలిసిందే. దీంతో, ఆయనపై అంతర్జాతీయంగా పలు అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. అంతేగాకుండా, ఆయనపై ఓ లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది. అరెస్టు భయంతో అసాంజే ఈక్వెడార్ ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో, వారు లండన్ లోని తమ ఎంబసీలో ఆశ్రయం కల్పించారు. రెండేళ్ళ నుంచి అసాంజే ఇక్కడే ఉంటున్నారు.