: ఇమ్రాన్ ధూం ధాంతో పాక్ సర్కారులో భయం... చర్చలకు సిద్ధమని ప్రకటన
పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ వేలాది మంది ప్రజలతో ఇస్లామాబాద్ దూసుకురావడం పట్ల నవాజ్ షరీఫ్ సర్కారులో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ తో చర్చలకు సిద్ధమని పాక్ సర్కారు ప్రకటించింది. ప్రభుత్వంపై సహాయ నిరాకరణ ప్రకటించాలని ఇమ్రాన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన తరుణంలో ప్రభుత్వ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇమ్రాన్ తో పాటు అవామీ తెహ్రీక్ నేత తాహిర్ ఉల్ ఖాద్రితోనూ చర్చలు జరుపుతామని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చౌధరీ నిసార్ స్పష్టం చేశారు. వారి డిమాండ్లను సానుకూల దృష్టితో పరిశీలిస్తామని తెలిపారు. వీరితో చర్చించేందుకు అన్ని పార్టీల సభ్యులతో రెండు కమిటీలు వేస్తామని, చర్చలు రేపు ఉంటాయని తెలిపారు.