: మన్మోహన్ సింగ్ కు టీవీ ఆన్ చేయడం కూడా రాదట!
భారత రాజకీయాలపై దూదిపింజంత అవగాహన ఉన్న వారెవ్వరికైనా మన్మోహన్ సింగ్ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కేబినెట్ లో ఆర్థికమంత్రి గా పనిచేసి... ఆర్థిక సంస్కరణలు తొలిసారి ప్రవేశపెట్టి... దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించన ఘనత మన్మోహన్ కే దక్కుతుంది. దశాబ్ద కాలం పాటు యూపీఎ-1, యూపీఎ-2 సర్కార్ల సారథిగా ఉంటూ ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించిన మన్మోహన్ సింగ్ పై ఇటీవలే ఆయన కుమార్తె దమన్ సింగ్... 'ద స్ట్రిక్ట్-లీ పర్సనల్- మన్మోహన్ అండ్ గురుశరణ్' అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో మన్మోహన్ జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను దమన్ సింగ్ వెల్లడించారు. మన్మోహన్ సింగ్ తొలుత డాక్టర్ కావాలనుకున్నారని... ఈ క్రమంలోనే ప్రీ మెడికల్ కోర్సులో చేరారని....అయితే ఆ తర్వాత సైన్స్ పై ఆసక్తి పోయి, ఆ కోర్సుకు ఫుల్ స్టాప్ పెట్టారని దమన్ పుస్తకంలో వెల్లడించారు. తన తండ్రి మన్మోహన్ సింగ్ మంచి హాస్య చతురుడని... కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల మీద జోకులు వేస్తారని ఆమె పేర్కొన్నారు. చదువుకునే సమయంలో మన్మోహన్ చాలా కష్టాలను అనుభవించారని దమన్ అన్నారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు పంపించే పాకెట్ మనీ, స్కాలర్ షిప్ డబ్బులు సరిపోక... భోజనం మానేసి, క్యాడ్ బరీ చాక్లెట్లతో మన్మోహన్ సరిపెట్టుకునేవారికి దమన్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ప్రధానిగా మన్మోహన్ అసమర్థుడు, ఆయనో నిస్సహాయ ప్రధాని... సోనియా చేతిలో కీలుబొమ్మ లాంటి కామెంట్లను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు విరివిగా చేసేవి. అందులో, నిజానిజాలెలా ఉన్నా ఇంటి విషయాల్లో మన్మోహన్ పూర్తిగా నిస్సహాయుడని దమన్ సింగ్ అన్నారు. మన్మోహన్ సింగ్ కు కనీసం గుడ్లు ఉడకబెట్టుకోవడం కూడా తెలీదని దమన్ తెలిపారు. అలాగే, సంక్లిష్టమైన ఆర్థిక విషయాలను ఔపోసన పట్టిన మన్మోహన్ సింగ్ కు కనీసం టీవీ ఆన్ చేయడం కూడా తెలీదని దమన్ తన పుస్తకంలో రాశారు. చిన్నచిన్న పనులు చేతకాకపోతేనేం... పదిసంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ దేశాన్ని పరిపాలించారు. ఇవీ... దమన్ సింగ్ పుస్తకంలోని కొన్ని విశేషాలు. మన్మోహన్ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావించిన దమన్...మన్మోహన్ 10ఏళ్లపాటు ప్రధానమంత్రిగా చేసినప్పటి సంగతులను మాత్రం పక్కనపెట్టారు. అవీ రాసి అనవసరంగా లేనిపోని వివాదాలను సృష్టించడం ఎందుకనేమో!