: కేసీఆర్ రిక్వెస్టును వెంటనే ఒప్పుకున్న చంద్రబాబు
కేసీఆర్ చేసిన ఓ రిక్వెస్టును చంద్రబాబు వెంటనే ఒప్పుకున్నారు. ఏపీ తెలంగాణల మధ్య ఐఏఎస్ అధికారుల విభజన తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మకు సంకటంగా పరిణమించింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజీవ్ శర్మ స్థానికేతరుడి కేటగిరిలో ఉన్నారు. స్థానికేతర ఐఏఎస్ లను రోస్టర్ పద్దతి (లాటరీ పద్దతి)ద్వారా ఏపీ, తెలంగాణాలకు కేటాయించాలని ఉద్యోగుల పంపకాలను చూస్తోన్న ప్రత్యూష్ సిన్హా కమిటీ నిర్ణయించింది. రోస్టర్ బ్యాండ్ పద్దతి ప్రకారం తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ ఆంధ్రప్రదేశ్ కు దక్కారు. అధికారికంగా ఇంకా ఆదేశాలు జారీ కానప్పటికీ... ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ అధికార యంత్రాంగంలో అలజడి మొదలయ్యింది. ఈ పరిణామంతో షాక్ తిన్న రాజీవ్ శర్మ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివారం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం జరిగినప్పుడు... కేసీఆర్ ఈ విషయాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. తెలంగాణకు చెందిన చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినా... వారిని తమకే ఇవ్వాలని కేసీఆర్ చంద్రబాబును కోరారు. తెలంగాణకు చెందిన చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను ఆంధ్రాకు కేటాయించినప్పటికీ, ఇక్కడ చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఆయనకు ఇవ్వడం కుదరదు... ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికే ఐవైఆర్ కృష్ణారావు సీఎస్ గా పనిచేస్తున్నారు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న చంద్రబాబు తెలంగాణ సీఎస్, డీజీపీలను తమ రాష్ట్రానికి కేటాయించినా... తెలంగాణకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీలుగా ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) జారీ చేస్తామని కేసీఆర్ కు హామీ ఇచ్చారు.