: టెస్టులు ఆడటం చేతకాకపోతే... వన్డేలు మాత్రమే ఆడుకోండి: గవాస్కర్ ఫైర్
ఇంగ్లండ్ తో జరిగిన ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో... టీమిండియా బ్యాట్స్ మెన్లు 94 పరుగులకే కుప్పకూలడంపై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో, బ్యాటింగ్ దిగ్గజం, ఆల్ టైం గ్రేట్ సునీల్ గవాస్కర్ భారత బ్యాట్స్ మెన్ పై మండిపడ్డారు. టెస్టులు ఆడటం చేతకాకపోతే వన్డేలు మాత్రమే ఆడుకోవాలని అన్నారు. జట్టు మొత్తం కలిసి కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయారని మండిపడ్డారు. ఇలాంటి చెత్త ప్రదర్శనతో భారతదేశానికి చెడ్డ పేరు తీసుకురాకండని ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశాల్లో క్రమం తప్పకుండా విజయాలు సాధించే సామర్థ్యం ప్రస్తుత జట్టుకు లేదంటూ... ధోనీ సేనపై గవాస్కర్ విరుచుకుపడ్డారు. స్వదేశంలో అంతా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి... గెలవడంలో గొప్పేమీ లేదని అన్నారు. లార్డ్స్ లో గెలిచిన తర్వాత... సిరీస్ గెలిచే అవకాశం వచ్చినప్పటికీ... మన ఆటగాళ్లు దాన్ని దుర్వినియోగం చేశారని అభిప్రాయపడ్డారు. చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తూ బ్యాట్స్ మెన్లు మన దేశ పరువును గంగలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.