: వివాదాలను పెంచుకోకుండా పరిష్కారం వైపు పయనిద్దామని చెప్పా: చంద్రబాబు
హైదరాబాదులోని సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ గవర్నర్, కేసీఆర్ తో జరిగిన సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. సమావేశం సుహృద్భావ వాతావరణంలో సాగిందని అన్నారు. ఇండియన్ సర్వీసెస్ ఉద్యోగుల పంపకాల అంశాన్ని కమిటీ పరిశీలిస్తోందని బాబు చెప్పారు. ఉద్యోగుల పంపకాలపై ఇద్దరు సీఎస్ లు మాట్లాడుకోవాలని చెప్పామని ఆయన అన్నారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. విభజనతో కొన్ని సమస్యలు వచ్చాయని, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. ఏపీకి ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చేవరకు కేంద్రం సాయం అవసరమని చంద్రబాబు చెప్పారు. ఇదే విషయాన్ని గవర్నరుకు, తెలంగాణ ప్రభుత్వానికి చెప్పానన్నారు. వివాదాలను పెంచుకోకుండా పరిష్కారం వైపు పయనిద్దామని చెప్పామని బాబు అన్నారు. మూడు నెలలైనా పాలనపై పట్టు సాధించలేకపోతున్నామన్నారు. విభజనలో కొన్ని సమస్యలున్నా తెలుగువారు కలిసుండాలని ఆయన ఆకాంక్షించారు. నాటి యూపీఏ ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాల వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన అన్నారు. ఇవాళ్టి సమావేశంలో సమస్యలను మాత్రమే ప్రస్తావించామని, పరిష్కారాలను చర్చించలేదని ఆయన చెప్పారు. అసెంబ్లీ సమావేశాలపై పరస్పర అవగాహన కుదిరిందన్నారు. హైదరాబాదు లాంటి మహానగరాన్ని నిర్మించాలంటే నాలుగైదు లక్షల కోట్లు అవసరమని ఆయన చెప్పారు.