: చంద్రబాబు, కేసీఆర్ ఏం మాట్లాడుకున్నారంటే...!
హైదరాబాదు రాజ్ భవన్ లో చంద్రబాబు, కేసీఆర్ మధ్య జరిగిన సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉద్యోగుల విభజన గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. ముందుగా ఇరు రాష్ట్రాల సీఎస్ లు కూర్చుని ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని, ఏవైనా సమస్యలుంటే తమను సంప్రదించాలని చంద్రబాబు, కేసీఆర్ చెప్పారు. 45 వేల మంది ఉద్యోగుల పంపిణీకి కమలనాథన్ కమిటీ ఎందుకని, ఇద్దరు సీఎస్ లూ సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని బాబు, కేసీఆర్ అన్నారు. ఉద్యోగుల విభజన పూర్తవగానే నీటి సమస్యలపై కూర్చుందామని చంద్రబాబుతో కేసీఆర్ అన్నారు. రెండు మూడుసార్లు సమావేశమై నీటి పంపకాల సమస్యను పరిష్కరించుకుందామని కేసీఆర్ అన్నారు. కేంద్రం చేసే సాయానికి గవర్నర్, చంద్రబాబు సహకరించాలని కేసీఆర్ కోరారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి నిధుల సేకరణలో గవర్నర్ పాత్రే కీలకమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ‘మన ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం వద్దు’ అని కేసీఆర్ తో చంద్రబాబు అన్నారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకుందామని బాబు చెప్పారు. ఘర్షణ పడుతుంటే కింది వ్యవస్థకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు కేసీఆర్ తో అన్నారు.