: ఇలా అయితే కాపురానికి రాలేమంటున్న యూపీ నూతన వధువులు
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో ఆత్మాభిమానం కోసం నూతన వధువులు తెగువ చూపించారు. మరుగుదొడ్డి కట్టించేంతవరకు కాపురం కుదరదని తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్ లో బహిర్భూమికి వెళ్లి చాలా మంది అత్యాచారాల బారిన పడుతున్నారు. మౌలిక సౌకర్యాలు లేని గ్రామాల్లో కుల, మత విద్వేషాల ప్రభావం మహిళలపైనే పడుతోంది. పురుషులపై వున్న తమ కక్షను మహిళలపై తీర్చుకుంటున్నారు. దాంతో బహిర్భూమికి వెళ్తున్న సందర్భంలో మహిళలను అపహరించడం, అత్యాచారం చేయడం జరుగుతోంది. కుషీనగర్ కు చెందిన నీలం, కళావతి, షకీనా, నిరంజన్, గుడియా, సీతకు కొన్ని రోజుల క్రితం పెళ్లిళ్లు జరిగాయి. అత్తవారింట మరుగుదొడ్డి లేకపోవడంతో వారు మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయారు. మరుగుదొడ్లు కట్టిస్తేనే కాపురానికి వస్తామని స్పష్టం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాథక్ మరుగుదొడ్లు కట్టిస్తామని ముందుకు వచ్చారు. మహిళలు ఇలా ముందుకు రావడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.