: ఇంగ్లండ్ కంటెయినర్ లో 35 మంది భారతీయులు, ఓ వ్యక్తి మృతి
బల్గేరియా నుంచి ఇంగ్లండ్ చేరిన ఓ నౌకలోని కంటెయినర్ లో 35 మంది భారతీయులు బయటపడ్డారు. కంటెయినర్ లో గంటల తరబడి చిక్కుకుపోయిన నేపథ్యంలో ఓ వ్యక్తి ఊపిరాడక మృత్యువాత పడ్డారు. మిగిలిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో వారిని ఇంగ్లండ్ పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కంటెయినర్ లో చిక్కుకున్న వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే వీరు కంటెయినర్ లో ఎలా చిక్కుకున్నారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బల్గేరియా నుంచి ఇక్కడికి చేరుకున్న నౌకకు చెందిన కంటెయినర్ లో పెద్ద సంఖ్యలో మనుషులు ఉన్నారన్న సమాచారంతో ఇంగ్లండ్ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. కంటెయినర్ నుంచి బాధితులను బయటికి తీసిన మరుక్షణమే వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కంటెయినర్ ను లోడ్ చేస్తున్న సందర్భంగా నమోదైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే గాని అసలు విషయం బయటపడదన్న ఇంగ్లండ్ పోలీసుల సూచనతో బల్గేరియా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.