: ఇద్దరు ‘చంద్రు’ల చర్చలు సఫలమయ్యేనా?
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుల మధ్య నేడు రాజ్ భవన్ లో జరిగే భేటీ ఎలాంటి ఫలితాలనిస్తుందన్న అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ భేటీపై ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గడచిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఇద్దరు నేతలు పలు అంశాలపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు నవ్వుతూ, తుళ్లుతూ కనిపించారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరైన ఇద్దరు నేతలు చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో నేటి మధ్యాహ్నం ఇద్దరు చంద్రులు, గవర్నర్ సమక్షంలో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. భేటీలో భాగంగా రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వాదనను వినిపించనున్నారు. ఈ వాదనలో చంద్రబాబు కంటే కేసీఆరే కొంతమేర ముందున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాటి భేటీలో ఏఏ అంశాలు ప్రస్తావించాలన్న అంశంపై శనివారమే ఆయన ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష చేశారు. అంతేకాక ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆదివారం ఉదయం వివిధ శాఖల అధికారులతో సమావేశమై, బాబుతో భేటీలో కేసీఆర్ ప్రస్తావించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు. అయితే కేవలం గంట పాటు జరిగే ఈ భేటీలో కీలకమైన అంశాలపై ఇద్దరు చంద్రులు రాజీకి వస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా ఫీజు రీయింబర్స్ మెంట్, పీపీఏల రద్దు, ఉద్యోగుల బదలాయింపు, పలు ప్రభుత్వ రంగ సంస్థల విభజన తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఇరు రాష్ట్రాల మధ్య నిత్యం వాడీవేడీ వాదనలకు కారణమవుతున్న అంశాలు చాలానే ఉన్నప్పటికీ, తొలివిడత భేటీలో అత్యంత ప్రాధాన్య అంశాలపైనే దృష్టి సారించాలని ఇరువురు నేతలు తీర్మానించినట్లు సమాచారం.