: 100శాతం గ్యారెంటీ, విజయవాడ-గుంటూరుల మధ్యే రాజధాని: చంద్రబాబు
కర్నూలులో నిన్న విలేకరులతో జరిగిన ఇష్టాగోష్టిలో చంద్రబాబు ఏపీ రాజధాని విషయంలో క్లారిటీ ఇచ్చారు. రాజధాని అవకాశాలు ప్రకాశం జిల్లా దొనకొండకు ఏ మేరకు ఉన్నాయని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దొనకొండలో ఖాళీ స్థలాలు తప్ప ఏమీలేవని... రాజధాని అంటే కేవలం గవర్నమెంట్ ఆఫీసులు మాత్రమే ఉండే ప్రదేశం కాదని... చక్కటి సిటీలైఫ్... మెరుగైన మౌలిక సదుపాయాలు కూడా రాజధానికి ఉండాలని ఆయన అన్నారు. దొనకొండ ఓ మారుమూల ప్రాంతమని... దాని చుట్టుప్రక్కల సరైన నగరం కూడా ఏదీ లేదని ఆయన అన్నారు. అలాంటి చోట రాజధాని నిర్మిస్తే ప్లాప్ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని వివరించడానికి చంద్రబాబు ఓ ఉదాహరణను విలేకరులకు చెప్పారు. మాజీముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సొంత ప్రాంతం మీద ప్రేమతో కడప జిల్లాలోని ఇడుపులపాయ గ్రామంలో ఓ వెటర్నరీ రీసెర్చ్ కేంద్రాన్ని... ఓ ఐఐఐటీని నెలకొల్పారని, అయితే... ప్రస్తుతం అక్కడ పనిచేయడానికి ఫ్రొఫెసర్లు, పరిశోధకులు ముందుకురావడం లేదని అన్నారు. అక్కడ సరైన సామాజిక మౌలిక సదుపాయాలు (సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రస్తుతం అవి అనుకున్నంత మేర ఫలితాలు అందించడం లేదని ఆయన అన్నారు. రాజధానిగా విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతమే ఉంటుందని చంద్రబాబు విలేకరులకు స్పష్టం చేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండడంతో పాటు... మంచి సిటీలైఫ్... మౌలిక సదుపాయాలు ఇప్పటికే బాగా ఉన్నందున విజయవాడ-గుంటూరును రాజధానిగా ఎన్నుకున్నామని చంద్రబాబు తెలిపారు. రాజధానిని విజయవాడ- గుంటూరుల మధ్య ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.