: ఆ ఎర్రచందనం మాది... మీకు అమ్మే హక్కులేదు: ఏపీ సర్కార్ కు కస్టమ్స్ శాఖ ఝలక్
అసలే లోటు బడ్జెట్... పైగా రుణమాఫీ చేసేందుకు కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి. రైతు రుణమాఫీకి సంబంధించి ఆర్బీఐపై పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు స్మగ్లర్ల నుంచి పట్టుకున్న ఎర్రచందనం చీకట్లో చిరుకాంతిలాగా కనపడింది. మొత్తం ఏపీ దగ్గర 11 వేల టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి. వీటిని అమ్మటం ద్వారా ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడంతో పాటు... రైతురుణమాఫీపై కూడా కొంత ఉపశమనం పొందాలని చంద్రబాబు అనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా కేంద్రం నుంచి ముందస్తుగా 4120 కోట్ల ఎర్రచందనాన్ని అమ్మేందుకు ఏపీ సర్కార్ పర్మిషన్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే గ్లోబర్ టెండర్స్ ను పిలిచి వచ్చే నెలలో బహిరంగ ఆక్షన్ వేయాలని చంద్రబాబు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే, ఎర్రచందనం అమ్మకం విషయంలో ఏపీకి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చర్యలకు సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ ఝలక్ ఇచ్చింది. ఈ ఎర్రచందనాన్ని ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రదేశాల్లో అక్రమ రవాణా అవుతుంటే తామే పట్టుకున్నామని... కాబట్టి, ఎర్రచందనం నిల్వలు తమకే చెందుతాయని ఏపీ సర్కార్ కు తెలియజేసింది. ఎర్రచందనం ఏ ప్రాంతానిదైనప్పటికీ... తాము పట్టుకుంటే అది తమకే చెందుతుందని సెంట్రల్ కస్టమ్స్ శాఖ వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఎర్రచందనాన్ని అమ్మే హక్కు ఏపీకి లేదంటూ స్పష్టం చేసింది. ఈ ఎర్రచందనం నిల్వలను తామే అమ్మి కేంద్రసర్కార్ ఖజానాలో జమ చేస్తామని తెలిపింది. అయితే, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ వాదన... కస్టమ్స్ శాఖ వాదనకు పూర్తి రివర్స్ లో ఉంది. కస్టమ్స్ శాఖ అధికారులు పట్టుకున్నప్పటీకీ... ఎర్రచందనం శేషాచలం అడవులకు చెందింది కాబట్టి... దీన్ని అమ్మే హక్కు తమకే ఉందని ఏపీ సర్కార్ అంటోంది. ఎర్రచందనం విషయంలో ఏపీ సర్కార్ కు సెంట్రల్ కస్టమ్స్ శాఖకు టగ్ ఆఫ్ వార్ మొదలవడంతో... వచ్చే నెలలో జరగనున్న ఆక్షన్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంపై కంగారుపడాల్సిన అవసరం లేదని... కేంద్రం దగ్గర మంచి పరపతి ఉన్న చంద్రబాబు ఈ సమస్యను పరిష్కరించగలరని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.