: అదే ఫలితం పునరావృతమవుతుందా?... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
మరోసారి అదే ఫలితం పునరావృతం కానుందా? భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఓవల్ లో జరగాల్సిన చివరి టెస్టు వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభం కానుంది. కాగా, టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతోంది. గత నాలుగు టెస్టులను ఓసారి పరిశీలిస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఓటమిపాలైంది. అదీ కాక పేస్, స్పిన్ మేలుకలయికతో భారత జట్టును ఇంగ్లండ్ బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, ఈ మ్యాచ్ కు వేదికైన ఓవల్ మైదానం వర్షం కారణంగా చిత్తడిగా మారడంతో కుక్ సేన తమకు అచ్చొచ్చిన పేస్ గేమ్ ప్లాన్ ను అమలు చేస్తుందా? భారత జట్టు రెండు మార్పులతో సిద్ధమైనప్పటికీ పట్టుదలతో సిరీస్ ను సమం చేస్తుందా? లేదా? అనే అనుమానం అభిమానులను వేధిస్తోంది. పిచ్ చిత్తడిగా మారిన నేపథ్యంలో గాడినపడని భారత ఆటగాళ్లు ఇంగ్లీష్ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకోగలరా? జడేజా, పంకజ్ సింగ్ స్థానాల్లో స్టువర్ట్ బిన్నీ, ఇషాంత్ శర్మ రావడం శుభసూచకమే అయినా టీమిండియా జాదూ చేస్తుందా? లేక చతికిలపడుతుందా? అన్న సందేహం పట్టిపీడిస్తోంది. బంగారంలాంటి అవకాశాన్ని జారవిడుచుకుని ఇప్పుడు సిరీస్ ఓటమి అంచున నిలిచిన టీమిండియాపై మరోసారి సీనియర్లు మండిపడుతున్నారు. కాగా, ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.