: చికెన్ గున్యా నిరోధానికి టీకా కనుగొన్నారు
శాస్త్రవేత్తలు వైద్య పరిశోధనల్లో మేలి మలుపులాంటి కొత్త విషయాన్ని కనుగొన్నారు. చికెన్ గున్యా పరిష్కారానికి టీకా కనుగొన్నారు. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో పనిచేస్తున్న జూలీ లెడ్జర్ వుడ్ వైరస్ లను పోలి ఉండే ప్రమాదరహితమైన కణాలు (వీఎల్పీ) ఉపయోగించి చికెన్ గున్యా నిరోధానికి టీకా కనుగొన్నారు. కాగా, ఈ టీకాను కనుగొనే క్రమంలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించలేదట. ఈ పరిశోధన వివరాలను ప్రఖ్యాత జర్నల్ లాన్సెట్ లో ప్రచురించారు. ఈ టీకాను ఆరోగ్యవంతులైన 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 25 మంది వలంటీర్ల మీద ప్రయోగించారు. శాస్త్రవేత్తలు ప్రతి వలంటీర్కు మూడు డోసుల్లో ఈ టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ల రక్తంలో చికన్గున్యాను న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీలను పరీక్షించారు. ఈ టీకాలు ఇచ్చిన వారికి ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. తొలిసారి టీకా ఇవ్వగానే తీసుకున్న వారిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీల రూపంలో ఒక రోగనిరోధక లక్షణం కనిపించింది. టీకాను అతి తక్కువ డోసులో ఇచ్చినా కూడా ప్రభావం కనిపించింది. రెండో డోస్ టీకా ఇచ్చేసారికి గ్రహీతలందరికీ యాంటీబాడీలు పూర్తిస్థాయిలో రూపొందాయి. ఇవి ఎక్కువ కాలం పాటు శరీరంలో ఉండటం, టీకా వేసిన ఆరు నెలల తర్వాత కూడా గ్రహీతలందరిలో కనిపించడం సానుకూల లక్షణమని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన జూలీ లెడ్జర్ వుడ్ తెలిపారని లాన్సెట్ వెల్లడించింది.