: ప్రణాళికా సంఘం వేస్ట్... దేశ అవసరాలకు తగ్గట్టు పనిచేయడం లేదు: మోడీ
ఎర్రకోట ప్రసంగంలో ప్లానింగ్ కమిషన్ (ప్రణాళికా సంఘం)పై మోడీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్లానింగ్ కమిషన్ పనితీరుపై ప్రజలు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రణాళికా సంఘాన్ని స్వాతంత్యం వచ్చిన కొత్తల్లో అప్పటి అవసరాలకు తగ్గట్టుగా రూపొందించారని మోడీ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం కాలం మారిందని... దేశ ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికా సంఘం పనిచేయలేకపోతోందని మోడీ వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు పాత ఇంటిని ఎంతో ఖర్చు పెట్టి కొత్తగా చేసుకున్నప్పటికీ, మనకు సంతృప్తి ఉండదని... దాని బదులు పాత ఇల్లును కూల్చివేసి కొత్త ఇంటిని కట్టుకోవడం చాలా ఉత్తమమని ప్రణాళికా సంఘాన్ని ఉద్దేశించి మోడీ కామెంట్ చేశారు. త్వరలోనే ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంస్థను ఎన్డీయే సర్కార్ నెలకొల్పుతుందని మోడీ వెల్లడించారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలపడేలా... అనుసంధాన కర్తగా ఈ నూతన సంస్థ నిలుస్తుందని మోడీ వ్యాఖ్యానించారు.