: నిజాయతీ, పారదర్శకత, బాధ్యత ఉండాలి: రాష్ట్రపతి సందేశం


భారతదేశ స్వాతంత్ర్య ఫలాలు ప్రతి వారికీ దక్కాలంటే పాలనలోనూ, ప్రజల్లోనూ నిజాయతీ, పారదర్శకత, బాధ్యత ఉండాలని రాష్ట్రపత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆయన భాతర జాతినుద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగ పరిమితులకు లోబడి పరిపాలన సాగాలని అన్నారు. ఆర్థిక పరిపుష్టే దేశ సంపద కాదని ఆయన సూచించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా భారతదేశం పయనించాలని ఆయన ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా నిరుపేదలు గ్రామాల్లో ఉన్నారని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ విద్య అందిన రోజున దేశంలో అంతరాలు తగ్గిపోతాయని ఆయన తెలిపారు. వ్యవసాయ పరిశ్రమ తీవ్ర సంక్షోభం అంచున ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. వినియోగం పెరిగి ఉత్పత్తి పడిపోతే దుర్భర దారిద్ర్యం అంచున నిలుస్తామని ఆయన హెచ్చరించారు. క్రమశిక్షణ, నైతిక విలువలు, మహిళలపట్ల గౌరవం పెంపొందించాల్సిన బాధ్యత విద్యాలయాలపై ఉందని ఆయన సూచించారు. శాంతి లేకుండా ఏదీ సాధించలేమని భారతీయులకు బాగా తెలుసని ఆయన అన్నారు. అందుకే అహింసావాదాన్ని గాంధీలాంటి మహనీయులంతా పాటించారని ఆయన తెలిపారు. ఆర్ధిక వ్యవస్థ గాడిన పడే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. విదేశాలతో మన సంబంధాలు బాగున్నాయని తెలిపిన ఆయన, మన స్వేచ్చ, హక్కులు కాపాడుకోవడంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతి భారతీయుడూ కాపాడుతున్నాడా? అని ప్రశ్నించుకోవాలని ఆయన సూచించారు. చట్టం పరిధిలో ప్రతిఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందడుగు వేస్తున్నా పరిశోధనలు అనుకున్నంత ఆశాజనకంగా లేవని ఆయన తెలిపారు. మాటలు చెప్పడం మాని, చేతల్లో పనితనం చూపించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. విజయం సాధించాలంటే పని చేయాలని సూచించిన ప్రణబ్... జైహింద్ అంటూ భారతీయుల్లో దేశభక్తి స్పూర్తినింపారు.

  • Loading...

More Telugu News