: మానవత్వం లేని తల్లి... తట్టుకోలేకపోయిన కొడుకు
మానవత్వం లేని తల్లికి తోడు రక్త క్యాన్సర్ ఓ వ్యక్తిని చంపేసింది. పాత సినిమా కథల్లోని సన్నివేశాన్ని తలపించే ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కందుకూరులోని ఓ మెడికల్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్న తాళ్లూరి కాశీ విశ్వనాథ్ (45) గత డిసెంబర్‌లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పరీక్ష చేయిస్తే బ్లడ్ క్యాన్సర్ అని నిర్థారణ అయింది. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్లో ఆయన చికిత్స చేయించుకున్నాడు. రెండు నెలల క్రితం చికిత్స ముగిసి ఇంటికి వచ్చినా, మళ్లీ వారం క్రితం ముక్కు, నోటివెంట రక్తం వచ్చింది. దీంతో మరోసారి ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమించిందని, తమ చేయిదాటిపోయిందని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కాశీవిశ్వనాథ్ భార్య లక్ష్మీ కమల, కందుకూరులో ఉంటున్న అతని తల్లికి చెప్పి, అతన్ని తీసుకుని బుధవారం రాత్రి ఇంటికి వచ్చింది. వారిని ఇంట్లోకి రానివ్వని ఆ తల్లి, తాళం వేసి మరో కుమారుడి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఏంచేయాలో తెలియని లక్ష్మీ కమల, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంటి ముందు అతన్ని పడుకోబెట్టి.. ఇంటి దూలానికి సెలైన్ బాటిల్ కట్టి ఎక్కిస్తూ రెండు గంటలపాటు గడిపింది. ఈ దారుణం చూసిన స్థానికులు, పోలీసులకు సమాచారమిచ్చి తాళం పగలగొట్టి విశ్వనాథ్ను ఇంట్లోకి తీసుకెళ్లారు. దీంతో విషమించిన తన ఆరోగ్య పరిస్థితిని, కన్నతల్లి నిరాదరణను తట్టుకోలేని కాశీ విశ్వనాధం తీవ్రవేదనతో తెల్లారేసరికి కన్నుమూశాడు. దీనిని చూసిన స్థానికులు కాశీవిశ్వనాధం తల్లిని నిందించారు. అతని జీవిత భాగస్వామి నిస్సహాయతపై ఆవేదన వ్యక్తం చేశారు.