: నరసింహన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ పై ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఉమ్మడి గవర్నర్ గా ఇరురాష్ట్రాలను సమానంగా చూడాల్సిన నరసింహన్... ఆంధ్రప్రదేశ్ పై సవతి ప్రేమను చూపిస్తున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతున్నప్పటికీ... నరసింహన్ ఏ మాత్రం స్పందించడం లేదని బాబు భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ లో ప్రభుత్వ భవనాల కేటాయింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతోందని టీడీపీ వర్గాలు అనేకమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ... నరసింహన్ ఇప్పటివరకు కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని పిలిచి మాట్లాడకపోవడంపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అలాగే, ఆంధ్రా ఐఏఎస్ అధికారులకు హైదరాబాద్ లో అవమానాలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన ప్రేక్షకపాత్ర వహించడం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను తప్పించాలని... కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News