: ములాయం ఓ హిజ్రా... అంటూ అజాంఖాన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు బయటికొచ్చింది!
అజాంఖాన్... ఉత్తరప్రదేశ్ రాజకీయ యవనికపై తరచూ వినిపించే పేరు. జయప్రదతో ఆయన వైరం ఎంతో ప్రాచుర్యం పొందింది. అన్నింటికీమించి, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఈ సమాజ్ వాదీ పార్టీ నేత దిట్ట. ఎంతటివాడంటే... సాక్షాత్తూ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నే హిజ్రా అనేటంత! అజాంఖాన్ 2009లో సమాజ్ వాదీకి దూరంగా ఉన్న సమయంలో, ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యను చేశాడనడానికి ఆధారంగా తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి కాదు, అనేకమార్లు ములాయంను హిజ్రాగా పేర్కొన్నట్టుగా ఆ వీడియో క్లిప్ లో ఉంది. ములాయం... రాంపూర్ జిల్లాలోని సువార్ తండా, మిలాక్, బిలాస్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలను చంఢీగఢ్ తరహాలో మలచడంలో విఫలమయ్యాడంటూ అజాంఖాన్ ఈ తీవ్ర వ్యాఖ్య చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో తెరపైకి రావడంతో అజాంకు చిక్కులు తప్పవని యూపీ రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వివాదాస్పద నేత గతంలోనూ నోటికి పనిచెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో దురాఘతాలకు సంజయ్ గాంధీ, అయోధ్యలో శిలాన్యాస్ కారణంగా రాజీవ్ గాంధీ హతులయ్యారని వ్యాఖ్యానించారు. వీరిద్దరినీ అల్లా శిక్షించాడని పేర్కొన్నారు. అంతేగాకుండా, నరేంద్ర మోడీ వైవాహిక జీవితంపైనా నోరుపారేసుకున్నారు. భార్యతో ఉండని వ్యక్తి, దేశంతో ఎలా ఉంటారని ప్రశ్నించారు.