: అతని రోజు సంపాదన 8.40 కోట్లు
ఒక్క రూపాయిని సంపాదించు... ఆ రూపాయే లక్షలు సంపాదిస్తుందని ఓ పెద్దమనిషి చెప్పినట్టు, స్టాక్ మార్కెట్ లో బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్ వాలా పెట్టిన పెట్టుబడులు అతని టర్నోవరును పెంచుకుంటూ పోయాయి. దీంతో ఆయన రోజు సంపాదన అక్షరాల 8 కోట్ల 40 లక్షల రూపాయలు. షేర్ మార్కెట్ లో బిగ్ బుల్ గా పిలుచుకునే రాకేష్ ఝున్ ఝున్ వాలా వివిధ కంపెనీల్లో కొన్న షేర్లు అతని ఆస్తిని పెంచుకుంటూ పోతున్నాయి. 2008లో బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించిన ఝున్ ఝున్ వాలా, 2009లో వచ్చిన రెసిషన్ బారినపడి తీవ్రంగా నష్టపోయారు. తరువాత భారత స్టాక్ మార్కెట్ కోలుకుని స్థిరమైన వృద్ధిరేటు సాధించడంతో ఆయన ఆస్తులు కూడా స్థిరీకరణ సాధించాయి. ఈ ఏడాది జూన్ చివరి నాటికి ఆయన కుటుంబం ఆస్తుల విలువ 7,261 కోట్ల రూపాయలు. ఏడాది క్రితం వీటి విలువ 4,192 కోట్ల రూపాయలే...ఈ ఏడాది ఆయన ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. దేశీయ స్టాక్ ఎక్సేంజీలో లిస్టయిన దాదాపు 96 శాతం కంపెనీల మార్కెట్ క్యాపిటల్ కంటే ఆయన కుటుంబ నెట్ వర్త్ అధికంగా ఉండడం విశేషం. దేశీయ స్టాక్ మార్కెట్ లోని టైటాన్, ల్యుపిన్, క్రిసిల్, ర్యాలీస్ ఇండియా, అరబిందో ఫార్మా, దేవాస్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఫెడరల్ బ్యాంక్ వంటి కంపెనీల్లో 100 కోట్లకు మించిన షేర్లు అతని కుటుంబం వద్ద ఉన్నాయి. దీంతో ఆయన రోజు సంపాదన 8.40 కోట్లకు చేరింది.