: ఆంధ్రా ఐఏఎస్ అధికారిని అడ్డుకున్న తెలంగాణ కానిస్టేబుల్
ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తోన్న ఐఏఎస్ అధికారి శ్యాంబాబును తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ అడ్డుకోవడం వివాదస్పదమవుతోంది. నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నాక్)కు డైరక్టర్ గా శ్యాంబాబును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నియమించింది. తన విధుల్లో భాగంగా నాక్ లోపలకి ప్రవేశించబోతున్న ఆయనను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపి... ఆ కానిస్టేబుల్ శ్యాంబాబును నాక్ లోపలికి వెళ్లనివ్వలేదు. ఈ విషయాన్ని, శ్యాంబాబు గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకువెళ్లారు. తన విధులకు ఆటంకం కలిగించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామన్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ లో ఆంధ్రా అధికారులకు జరుగుతోన్న అవమానాలపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.