: టీటీడీ పాలకమండలి రద్దు... బాపిరాజుకు సర్కారు షాక్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు తీవ్ర నిర్ణయం తీసుకుంది. గతకొన్నాళ్ళుగా పదవులు వీడాలంటూ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజుతోపాటు బోర్డు సభ్యులకు సామరస్య పూర్వకంగా చెబుతూ వచ్చిన ప్రభుత్వం... తమ మాట వినకపోయేసరికి తాజా ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి బాపిరాజు పదవీకాలం ఈ నెల 24తో ముగియనున్నా తాజా ఉత్తర్వుల ప్రకారం అంతకుముందే ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులకు అన్ని సౌకర్యాలు నిలిపివేశారు. అంతేగాకుండా వారికి శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశాన్ని రద్దు చేశారు. వారికి కేటాయించిన భవనాలు, వాహనాలు స్వాధీనం చేసుకోనున్నారు. మరో వారం రోజుల్లో కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. టీటీడీ చైర్మన్ రేసులో చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మురళీమోహన్, జేసీ దివాకర్ రెడ్డి తదితరులున్నారు.