: స్నూప్ గేట్ కేసులో మోడీని విచారించేది లేదు: సుప్రీం కోర్టు


స్నూప్ గేట్ కేసులో ప్రధాని నరేంద్ర మోడీని విచారించేది లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. అంతేకాక ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ ను దాఖలు చేయాలని మోడీకి ఆదేశాలు జారీ చేయలేమని కూడా పేర్కొంది. ఓ మహిళా ఆర్కిటెక్ట్ పై నిఘా కోసం గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోడీ ఆదేశాలు జారీ చేశారని ఆరోపించిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ శర్మ, దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శర్మ పిటిషన్ పై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, మోడీపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయలేమని చెప్పింది. తనవద్ద ఉన్న ఆడియో టేపులను పరిశీలిస్తే, స్నూప్ గేట్ లో మోడీ ప్రమేయం నిర్ధారణ అవుతుందన్న శర్మ అభ్యర్థనపై కోర్టు మండిపడింది. అసలు విషయాన్ని పక్కనబెట్టి, అనవసర విషయాలను తెరమీదకు ఎందుకు తెస్తారని ఈ సందర్భంగా శర్మ తరఫు న్యాయవాదిని కోర్టు మందలించింది. తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గుజరాత్ సర్కారు పలు కేసులు బనాయించిందని ఆరోపించిన శర్మ, తనపై గుజరాత్ పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలంటూ తొలుత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనంతరం స్నూప్ గేట్ లో మోడీ ప్రమేయముందని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరడంతో, వితండవాదన విడనాడాలని కోర్టు ఆయనకు తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News