: రాజ్యసభలో ఎంపీల సహనాన్ని పరీక్షించిన రాజ్ నాథ్ సింగ్


కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ఈరోజు (మంగళవారం) సభ్యుల సహనాన్ని పరీక్షించారు. తన శాఖ పనితీరుపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి రెండు గంటల పాటు సమాధానం చెప్పారు. దాంతో, మరోసారి సభ్యులెవరూ ఆయన్ను ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా చేశారు. మంత్రి సుదీర్ఘ సమాధానంతో విసుగుచెందిన సభ్యులు ఇంకోసారి రాజ్ నాథ్ ను ఏ ప్రశ్న అడగబోమని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ సభలో చేతులు ముడుచుకుని చేసేదిలేక అభ్యర్థనగా రాజ్ నాథ్ వైపు చూస్తూ ఉండిపోయారు. మొత్తం ఎనిమిది గంటల పాటు జరిగిన చర్చలో సభ్యులు మాట్లాడిన, లేవనెత్తిన ప్రతి పాయింట్ కు కూడా మంత్రి జవాబిచ్చారు. దీనివల్ల రాజ్ నాథ్ కొన్నిసార్లు సమాధానం చెప్పేందుకు ఎంత సమయం తీసుకుంటారో కూడా తెలియదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ అన్నారు. మంత్రి జవాబుపై సీపీఐ(ఎం) సభ్యుడు సీతారాం ఏచూరి స్పందిస్తూ, సభలో సభ్యుల సహనాన్ని పరిక్షించాలని ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఉందన్నారు. ప్రతిపక్షాన్ని ఈ విధంగా ఎదుర్కోవడం మంచి స్ట్రాటజీ అని పేర్కొన్నారు. సభలో లేని సభ్యుల ప్రశ్నలకు కూడా మంత్రి సమాధానం చెప్పడం తమ సహనాన్ని పరీక్షించడమేనని పలువురు అన్నారు. చివరిగా కురియన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడంపై సభ్యులు మీపై ఫిర్యాదు చేస్తున్నారని రాజ్ నాథ్ తో నవ్వుతూ చెప్పారు.

  • Loading...

More Telugu News