: లోక్ సభలో జువెనైల్ జస్టిస్ బిల్లు
జువెనైల్ జస్టిస్ బిల్లును లోక్ సభలో ఈరోజు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ ప్రవేశపెట్టారు. అత్యాచారం వంటి దారుణమైన నేరాలకు పాల్పడిన పదహారేళ్లలోపు బాలనేరస్థులను వయోజనులుగా పరిగణించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. దీని ద్వారా సదరు నేరస్థుడికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడదుగానీ, కొన్నేళ్లపాటు జైలు శిక్ష మాత్రం విధిస్తారు. ఈ క్రమంలో నేరాలను అరికట్టేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో ఇరవైఏళ్లలోపు యువకులే అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ఆలోచనతో బిల్లును తీసుకొచ్చింది. గతవారం ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, ఇప్పటివరకు పద్దెనిమిదేళ్లలోపు వారు నేరానికి పాల్పడితే జువనైల్ జస్టిస్ బోర్డు విచారణ జరుపుతుంది. మైనర్లపై నేరం రుజువైతే మూడు సంవత్సరాల పాటు జువనైల్ హోమ్ కు పంపుతున్న సంగతి తెలిసిందే.