: గణపతి ఆచూకీకి... మహారాష్ట్ర కోటి రూపాయల ఆఫర్
మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ చెబితే కోటి రూపాయలు ఇస్తామంటూ మహారాష్ట్ర సర్కారు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ను కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమతం చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటిదాకా గణపతి ఆచూకీ తెలిపిన వారికి రూ. 60 వేలను మాత్రమే ఇస్తామని చెబుతూ వచ్చిన మహారాష్ట్ర, ఒకేసారి ఈ మొత్తాన్ని రూ. కోటికి పెంచడం గమనార్హం. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిన మావోయిస్టుల హోదాను బట్టి, వారి సమాచారం అందించిన వారికి రూ. 10 వేల నుంచి 60 వేల వరకు మాత్రమే నజరానాను ఇచ్చేది. అయితే సవరించిన విధానం ప్రకారం మావోయిస్టు అగ్రనేతగా ఉన్న గణపతి ఆచూకీ కోసం ఏకంగా రూ. కోటి ఆఫర్ ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్, గడ్చిరోలి, గోండియా, చంద్రాపూర్, నాందేడ్, యావత్మాల్, భండారా జిల్లాలకే పరిమతమంటూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.