: చేపల కోసం కోల్ కతాలో భారీ ఆసుపత్రి
కోల్ కతాలో ఓ ప్రత్యేకమైన ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. ప్రత్యేకం ఎందుకంటే, ఈ ఆసుపత్రిలో బెడ్ లు ఉండవు... కేవలం వాటర్ ట్యాంక్ లు మాత్రం ఉంటాయి. దీనికి కారణం, ఇది మనుషుల కోసం నిర్మిస్తున్న ఆసుపత్రి కాదు... చేపల కోసం కడుతున్న హాస్పిటల్. 500 లీటర్లు నీరు సరిపోయే వృత్తాకార వాటర్ ట్యాంకులు 25 ఈ ఆసుపత్రిలో ఉంటాయి. ఈ వాటర్ ట్యాంకులతో పాటు బుల్లిచేపల కోసం ఆక్వేరియమ్స్ కూడా ఉంటాయి. 1.75 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆర్థిక సహాయం అందిస్తోంది. పరిశ్రమల వ్యర్థాలు, మునిసిపాలిటీ చెత్త, క్రిమిసంహారిణులు, కెమికల్ ఫెర్టిలైజర్స్ కారణంగా బెంగాల్ వ్యాప్తంగా ఉన్న చెరువులు, నదులు, కాలువలు కలుషితం అవుతున్నాయి. ఈ కలుషితాల్లో ఉన్న రకరకాల బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల చేపలు రకరకాల వ్యాధులకు గురవుతున్నాయి. బెంగాల్ లోని చెరువులు, నదులు, కాలువలలో పెరుగుతున్న చేపల్లో సుమారు 60 రకాల వ్యాధులు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్లినిక్ ప్రారంభమైన వెంటనే... చేపల పెంపకందారులు వ్యాధులతో బాధపడుతున్న చేపలను తమ క్లినిక్ కు తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆసుపత్రి పూర్తయిన వెంటనే... పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు ఒక చేపల ఆసుపత్రిని ఏర్పాటుచేయాలని అనుకుంటున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అన్నట్టు, బెంగాలీలకు చేపలు ప్రధాన ఆహారం... తమ భోజనంలో చేప లేకపోతే వారు దాన్ని అసంపూర్తిగా భావిస్తారు.