: 'హిందుత్వ' అంటే ఇదీ..!: సరికొత్త నిర్వచనం చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్


"ఇంగ్లండ్ దేశస్తులను ఇంగ్లిష్ వాళ్ళని అంటాం, జర్మనీ ప్రజలను జర్మన్లని పిలుస్తాం, యూఎస్ఏలో ఉండేవారిని అమెరికన్లని అంటాం... మరి, హిందుస్థాన్ లో నివసిస్తున్న వారిని హిందువులుగా ఎందుకు పరిగణించడంలేదు?"... ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సూటిగా సంధించిన ప్రశ్నాస్త్రం. తన ప్రశ్నకు తానే జవాబిస్తూ "భారతీయులందరి సాంస్కృతిక గుర్తింపు 'హిందుత్వ'. ఇక్కడ నివసిస్తున్న వారందరూ ఆ మహోన్నత సంస్కృతికి వారసులే" అని పేర్కొన్నారు. కటక్ లో ఓ ఒడియా పత్రిక వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ అనేది ఓ మతం కాదని, అది ఓ జీవన విధానమని వివరించారు. ప్రాచీన కాలం నుంచి భారత్ భిన్న వైరుధ్యాల నేపథ్యంలోనూ సంఘటితంగా ఉండడానికి కారణం హిందుత్వ అని ఇప్పుడు మిగతా ప్రపంచం తెలుసుకున్నదని ఈ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ తెలిపారు. అయితే, దురదృష్టకర రీతిలో భారత్ లో కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని, హిందుత్వ గురించి చెబితే మతవాద ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ధర్మం వర్ధిల్లినంత కాలం ప్రపంచం మనల్ని గౌరవిస్తుందని, అదే, ధర్మం కాలధర్మం చెందిననాడు ప్రపంచంలో ఏ శక్తీ మన వినాశనాన్ని ఆపలేదని భగవత్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News