: పాటిల్ సార్ జిమ్ కెళితే... పతకాల పంటేనట!


ఏంటి... జిమ్ కెళితే పతకాలు వచ్చేసినట్టేనా? అని ప్రశ్నలు వేసే ముందు పాటిల్ సార్ జిమ్ ఘనతేంటో ఓ సారి చూసేద్దాం. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్ వెయిట్ లిఫ్టింగ్ లో సాధించిన పతకాల సంఖ్య ఎంత? ఏడు! వాటిలో మూడు పతకాలు ఈ పాటిల్ సార్ జిమ్ లో శిక్షణ తీసుకున్నవారు సాధించినవే మరి. అసలీ పాటిల్ సారేమిటీ? ఆ జిమ్ గొప్పతనమేమిటీ? అసలెక్కడుందీ ఆ జిమ్? అనేగా మీ ప్రశ్న. సరే, నేరుగా మహారాష్ట్రలోని కొల్హాపుర్ కెళ్లి, అక్కడ కురుంద్వాడ్ గ్రామం ఎక్కడని ఎవరిని అడిగినా, ఇట్టే చెప్పేస్తారు. మీరడిన వ్యక్తికి ఏమాత్రం తీరిక ఉన్నా, చూపిస్తాను పదండంటూ మీతో పాటే తనూ వస్తాడు. ఎందుకంటే ఆ జిమ్ అంటే అక్కడి వారికీ ఆసక్తే మరి. కురుంద్వాడ్ వాసి ప్రదీప్ పాటిల్, వ్యాయామంపై ఆసక్తితో తనలాంటి అభిరుచి కలిగిన మిత్రులతో కలిసి హెర్క్యూలస్ పేరిట ఓ జిమ్ ను 1978లో ప్రారంభించారు. వీరిని చూసి శరీరధారుఢ్యం పెంచుకునేందుకు గ్రామ యువత కూడా చిన్నగా జిమ్ బాట పట్టారు. అలా ఈ జిమ్ బాట పట్టిన గణేశ్ మాలి, మహేశ్ మాలి, ఓంకార్ ఒటారి, గ్లాస్గో క్రీడల్లో మూడు కాంస్య పతకాలను ఒడిసి పట్టారు. ఈ జిమ్ లో బరువులెత్తే విద్యలు నేర్చి, జిమ్ వద్దకు పతకాలను మోసుకొచ్చారు. గ్లాస్గో క్రీడల్లో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో తమ దేశాన్ని ఛాంపియన్ గా నిలిపారు. అయితే, వ్యాయామంలో యువతకు పలు మెళకువలు నేర్పే క్రమంలో ప్రదీప్ పాటిల్, కురుద్వాండ్ వాసులకు పాటిల్ సార్ గా మారిపోయారు. అందరూ ఆ జిమ్ ను పాటిల్ సార్ జిమ్ అనే పిలుస్తారు. వ్యాయామం కోసం జిమ్ కు వచ్చే యువతలోని నైపుణ్యాలను గుర్తించిన పాటిల్, వెయిట్ లిఫ్టింగ్ లో ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో కొలరాడోలోని మెల్ సిఫ్ అనే శాస్త్రవేత్త ఉచితంగానే వెయిట్ లిఫ్టింగ్ పాఠాలను నేర్పారు. ఓ క్రీడా పరికరాల సంస్థ నుంచి సబ్సీడీ కింద బలవర్ధక ఆహారం, ఔషధాలను అందించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పాటిల్ చెప్పిన పాఠాలను ఒంటబట్టించుకున్న గ్రామ యువత పతకాల వేట మొదలెట్టింది. ఒకే ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలను సాధించింది. ప్రస్తుతం పాటిల్ సార్ జిమ్ లో 40 మంది దాకా యువత వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ పొందుతున్నారు. వీరిలో 11 ఏళ్ల బుడతలూ ఉన్నారు. అయితే భవిష్యత్తులో పాటిల్ సార్ జిమ్ మరిన్ని పతకాలను సాధించినట్లే. ఆల్ ద బెస్ట్ పాటిల్ సార్...!

  • Loading...

More Telugu News