: హైదరాబాద్ పరిసరాల్లో సర్కారీ కూరగాయల సాగు!
ఎట్టకేలకు అధికారులకు సరైన మార్గం కనిపించింది. అధికారులకు దొరికిన ఈ మార్గం హైదరాబాద్ నగర వాసుల కూరగాయల కొరతను తీర్చనుంది. ఇప్పటిదాకా హైదరాబాద్ కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కూరగాయలు సరిపోకపోతే, నేరుగా ఇతర రాష్ట్రాలను ఆశ్రయించడం జరుగుతోంది. అయినా ఏటా జూలై మాసం వచ్చేసరికి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి చెక్ పట్టేందుకు మార్కెటింగ్, ఉద్యానవన శాఖలు పరిశోధనలు, పరిశీలన పర్యటనల పేరిట రూ.4 కోట్లు తగలేసిన తర్వాత కాని ఆ శాఖలకు సరైన ఆలోచన రాలేదు. దీంతో ఎట్టకేలకు సరైన మార్గంలో పయనించేందుకు పక్కా ప్రణాళిక రచించాయి. ఇప్పటికే దానిని అమలులోనూ పెట్టేశాయి. మరో రెండు నెలలుంటే ఆ ప్రణాళిక ఫలాలు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానున్నాయి. అసలు విషయమేమిటంటే, హైదరాబాద్ కు అవసరమైన మేరకు కూరగాయలను అందించేందుకు పక్క ప్రాంతాలకు వెళ్లకుండా, నగర పరిసరాల్లోనే ప్రత్యేకంగా కూరగాయలను సాగు చేయాలని మార్కెటింగ్, ఉద్యానవన శాఖలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా నగరానికి 50 కిలో మీటర్ల పరిధిలోని రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 1,900 ఎకరాల పొలాలను గుర్తించాయి. ఈ భూముల రైతులకు సాంకేతిక, ఆర్థిక సహకారాలు అందించి ఆధునిక పద్ధతుల్లో కూరగాయల సాగును ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది. రెండు నెలల్లోగా అందుబాటులోకి వచ్చే కూరగాయలను నగర పరిధిలోని మార్కెట్లలో విక్రయానికి పెట్టనున్నారు. అంటే, రెండు నెలలుంటే నగర వాసులకు తక్కువ ధరలకే తాజా కూరగాయలు లభించే అవకాశాలున్నాయి.