: విశాఖలో గచ్చిబౌలి తరహా స్పోర్ట్స్ కాంప్లెక్స్: గంటా
విశాఖపట్నంలోనూ గచ్చిబౌలి తరహాలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో జరుగుతున్న ఆంధ్రా క్రికెట్ సంఘం డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటాతోపాటు మరో మంత్రి అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, వచ్చే జాతీయ క్రీడలు మనరాష్ట్రంలోనే నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 13 జిల్లాల్లోనూ స్పోర్ట్స్ అకాడమీలు, కాంప్లెక్స్ లు నిర్మిస్తామని చెప్పారు. ఇక, ఆంధ్రా క్రికెట్ సంఘం శ్రీకాకుళంలో నిర్మించతలపెట్టిన క్రికెట్ స్టేడియానికి 13 ఎకరాల స్థలం సిద్ధం చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. కాగా, ఈ వజ్రోత్సవ వేడుకలకు ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్, అనిల్ కుంబ్లే, మహ్మద్ కైఫ్ తదితరులు హాజరయ్యారు.