: మోడీ బొమ్మ ఉన్న రాఖీలకు యమ గిరాకీ
ప్రధాని నరేంద్ర మోడీలో మహిళలు ఓ నమ్మకస్తుడైన సోదరుణ్ని చూసుకుంటున్నారు! నేడు రక్షాబంధన్ సందర్భంగా మోడీ బొమ్మలున్న రాఖీలు అత్యధికంగా అమ్ముడవుతుండడమే అందుకు నిదర్శనం. ముఖ్యంగా ఉత్తరభారతంలో మోడీ రాఖీల హవా ఎక్కువగా ఉందట. మోడీ బొమ్మ ఉన్న రాఖీ కడితే మంచి రోజులు వస్తాయని అక్కడి మహిళలు భావిస్తున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో మోనా అనే మహిళ మాట్లాడుతూ, మోడీ పాలనలో ధరలు తగ్గుతాయని భావిస్తున్నట్టు తెలిపింది. ఆయన పాలనలో అందరికీ మంచి రోజులు వస్తాయని విశ్వసిస్తున్నట్టు పేర్కొంది. ఇక, యూపీకి చెందిన షాబీ జెహ్రా అనే మహిళ మాట్లాడుతూ, మోడీ ఓ సోదరుడిలాంటి వ్యక్తని, ఆయన తమ జిల్లాను పట్టించుకుంటారని అంటోంది. రక్షాబంధన్ సందర్భంగా మహిళలు తనకు పది మీటర్ల రాఖీ అందించారని, దాన్ని తాను మోడీకి పంపుతానని మొమ్రాజ్ సింగ్ అనే వ్యక్తి చెప్పాడు. కాగా, ప్రధాని నియోజకవర్గం వారణాసి నుంచి పెద్ద ఎత్తున మహిళలు మోడీకి రాఖీలు పంపడం విశేషం.