: ధోనీని గుర్తించలేకపోయిన కామెడీ స్టార్ తల్లి
'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమంతో విపరీతమైన పాప్యులారిటీ సంపాదించుకున్న వ్యక్తి కపిల్ శర్మ. తన విలక్షణ హావభావాలు, ఆహార్యంతో ఆయన వేదికపై పండించే హాస్యం ఇప్పుడు దేశంలోని టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. కాగా, ఈ కామెడీ స్టార్ క్రికెట్ అంటే పడిచస్తాడు. ఇటీవలే క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ బాధితుల కోసం లండన్ లో ఓ వేలం కార్యక్రమం నిర్వహించాడు. కపిల్ శర్మ ఆ కార్యక్రమంలో తన కామెడీ షోతో అందరినీ అలరించాడు. శర్మ తన తల్లిని కూడా యువీ ఛారిటీ వేలం కోసం లండన్ తీసుకువచ్చాడు. భారత్ విడిచిరావడం ఆమెకు అదే ప్రథమం. వేలం కార్యక్రమానికి ఎందరో క్రికెట్ ప్రముఖులు హాజరయ్యారు. అప్పటికే ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా వచ్చాడు. ధోనీకి పెద్ద ఫ్యాన్ అయిన కపిల్ శర్మ ఈ సందర్భంగా తన తల్లికి ధోనీని పరిచయం చేశాడు. అయితే, ఆమె ధోనీని గుర్తించలేకపోయింది. "బేటా క్యా నామ్ హై ఆప్ కా?" అంటూ ధోనీని ప్రశ్నించింది. దీంతో, కపిల్ శర్మ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఆమె అలా అడుగుతుందని ఈ కమెడియన్ అస్సలు ఊహించలేదట. చివరికి ఎలాగోలా ఆ పరిచయ కార్యక్రమాన్ని ముగించాడు. కాగా, కపిల్ శర్మ తల్లికి సచిన్ టెండూల్కర్ గురించి తెలుసు కానీ, ఎప్పుడూ చూడలేదట. ఓసారి ఇలాగే సచిన్ సరసన తల్లిని ఉంచి ఫొటో తీయగా, ఎందుకు చెప్పలేదు నాకు అతను సచిన్ అని? అంటూ ఆ తర్వాత ప్రశ్నించిందట. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ శర్మ పంచుకున్నాడీ సంగతులన్నీ.