: రాజ్యసభలో భాజపాకు సంఖ్యాబలం లేకపోవడం వల్ల అభివృద్ధి వేగం కుంటుపడుతోంది: వెంకయ్య
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ... కాంగ్రెస్ విభజన రాజకీయాలను మానుకోలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. చరిత్రలో ఎన్నడూ ఎరగని పరాజయం పాలైనప్పటికీ కాంగ్రెస్ కు బుద్ధిరాలేదని విరుచుకుపడ్డారు. పదేళ్ల యుపీఏ పాలనలో దేశం చాలా నష్టపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కాలంలో దేశ ఆర్థికవృద్ధి రేటు తగ్గడంతో పాటు... వ్యవసాయరంగం కూడా ఘోరంగా దెబ్బతిందన్నారు. ఇదే సమయంలో అంధకారంలో ఆశాకిరణంలా మోడీ కనపడితే ప్రజలు ఆయనను గెలుపించుకున్నారన్నారు. మోడీ నాయకత్వానికి దేశ ప్రజలు మద్దతు లభించడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. చివరకు కాంగ్రెస్ హయాంలో చేసిన చట్టాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తోంటే కూడా కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. సత్వర ఆర్థికవృద్ధి కోసం పార్టమెంట్ లో కొత్త చట్టాలు తీసుకొస్తుంటే కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆయన అన్నారు. లోక్ సభతో పాటు రాజ్యసభలో కూడా మోడీ నాయకత్వానికి పూర్తి మధ్దతు అవసరమన్నారు. రాజ్యసభలో భాజాపాకు మెజార్టీ లేకపోవడం వల్ల అభివృద్ధి వేగం కాస్త కుంటుపడుతోందన్నారు. కాబట్టి త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి మోడీకి పూర్తి స్వేచ్ఛనివ్వాలని ఆయన ప్రజలను కోరారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిస్తే... భాజాపా రాజ్యసభలో కూడా బలపడుతుందని ఆయన అన్నారు.