: నిలేకనీ... మోడీని మెప్పించాడు, ఆధార్ ను బతికించాడు!


యూపీఏ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నగదు బదిలీ పథకానికి కీలకం ఆధార్ కార్డులు. అయితే, వీటి జారీ ప్రక్రియ పూర్తి కాకముందే యూపీఏ పాలన పగ్గాలను వదిలేయాల్సి వచ్చింది. యూపీఏ పథకాలపై అప్పటికే పలు సందర్భాల్లో విమర్శల వర్షం కురిపించిన బీజేపీ అధికారం చేపట్టింది. దీంతో ఇక ఆధార్ కు కాలం చెల్లిపోయినట్టేనని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆధార్ కార్డుల జారీ సంస్థకు యూపీఏ కేటాయించిన బడ్జెట్ మరింత పెరిగిందే తప్ప పైసా కూడా తగ్గలేదు. అదేంటి, ఆధార్ కార్డుల జారీ ఇక నిలిచిపోయినట్టే కదా, ఇప్పటికే దాదాపుగా రూ. 1,000 కోట్లకు పైగా నిధులు వృథా అయిపోయాయి. ఇక బడ్జెట్ పెరగడమేంటి? అనే కదా మన సంశయం. అదంతే. ఇన్ఫోసిస్ ను ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టిన మిత్ర బృందంలో ఒకరైన నందన్ నిలేకనీ... ప్రధాని మోడీని మెప్పించలేకపోతారా..? మెప్పించి తీరుతారు, కాదండి మెప్పించేశారు. ఆధార్ కార్డులకు మళ్లీ జీవం పోశారు. ఆధార్ కార్డుల జారీ సంస్థకు అధిపతిగా పనిచేసింది నందన్ నిలేకనేగా. మరి ఆధార్ ను బతికాంచాల్సిన బాధ్యత కూడా తనదేననుకున్నారో, ఏమో కాని కార్డుల జారీ విషయంపై నేరుగా ప్రధానిని కలిశారు. కార్డుల ప్రాధాన్యాన్ని, నగదు బదిలీ ఆవశ్యకతను వివరించారు. అంతే, నిలేకనీ వాదనకు ముగ్ధుడైన మోడీ, వెంటనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోనూ భేటీ కమ్మంటూ నిలేకనీకి చెప్పారట. వెనువెంటనే నిలేకనీ, జైట్లీతో సమావేశమయ్యారట. అంతే, మొన్నటి బడ్జెట్ కేటాయింపుల్లో ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)కి అంతకుముందు పేర్కొన్న రూ. 1,550 కోట్ల కేటాయింపులు రూ.2,039 కోట్లకు పెరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన మీడియా అసలు సంగతేంటని ఆరా తీస్తే, మోడీని మెప్పించిన నిలేకనీ... ఆధార్ కార్డుల జారీకి జీవం పోశారని తెలిసిందట. ఇక ఆధార్ కార్డులను రద్దు చేయడం సాధ్యం కాదని విశ్లేషకులు వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News