: ఇక నుంచి భర్తకొక బ్యాంకు ఖాతా, భార్యకు మరొకటి
దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఖాతాలు తెరవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. భర్త పేరుతో ఓ బ్యాంకు ఖాతా, భార్య పేరుతో మరొక అకౌంట్ ఉండేలా చూడాలని కేంద్రం పేర్కొంది. ‘సంపూర్ణ విథీయ సమావేశన్’ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్) పేరుతో కొత్త పథకానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15వ తేదీన శ్రీకారం చుడుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15కల్లా ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతాలు తెరచి, డెబిట్ కార్డు అందజేయాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ముఖ్య ఉద్దేశాలను, లక్ష్యాలను అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా పంపింది. ప్రతి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బ్యాంకు సేవలు అందేలా చూడాలని, ‘రూపే’ పేరుతో ప్రతి కుటుంబానికి డెబిట్ కార్డు అందజేయాలని పేర్కొంది. ఈ కార్డుపై రూ.5 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే సదుపాయం ఉంటుంది. ఈ కార్డు పొందిన వారికి రూ. లక్ష విలువైన ప్రమాద బీమా ఉంటుంది. అలాగే, అన్ని మండల కేంద్రాల్లో ఏదైనా ఒక బ్యాంకు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ఇలా బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన మండల కేంద్రాలు తెలంగాణలో ఐదు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 7,619 గ్రామాలకు కొత్తగా బ్యాంకు సేవలు అందించాల్సి ఉంది.