: హైదరాబాదులో... కుక్కలు బాబోయ్!
హైదరాబాదులో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కుక్కలకు కనిపించారా... అంతే సంగతులు! గత మూడు రోజుల్లో 150 మందికి కుక్కగాట్లు పడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఫీవర్ ఆసుపత్రిలోనే కుక్క గాటు పడిన 134 మందికి చికిత్స చేస్తున్నారు. కుక్కకాటు బాధితుల్లో ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఉంటున్నారు. మల్కాజిగిరి, ఉప్పల్, అంబర్ పేట, జియాగూడ, యూసుఫ్ గూడ, రహ్మత్ నగర్, చైతన్యపురిలో వీధి కుక్కల బెడద మరింత ఎక్కువగా ఉంది. మల్కాజ్ గిరి లో మూడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేయడంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, ఆ బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల దాడులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివారించాలని జీహెచ్ఎంసీకి విజ్ఞప్తి చేస్తున్నారు.