: పరుగులెడుతున్న మెట్రో రైలుకు నిర్వహించే పరీక్షలివే
గత రెండు రోజులుగా హైదరాబాద్ మెట్రో రైలుకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పరీక్షలు ఏమిటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నిపుణులు నిర్వహించే పరీక్షల వివరాలివే... పట్టాలపై రైలు నిలిపి ఉన్నపుడు నాగోల్ డిపోలో స్టాటిక్ టెస్ట్-1 మొదటి టెస్టు కాగా, ఎలివేటెడ్ మార్గంలో పరుగులు తీస్తున్నపుడు స్టాటిక్ టెస్ట్స్, దానితోపాటు ఎలివేటెడ్ మార్గంలోని ప్రధాన మార్గం (పట్టాలమార్గం) సామర్థ్యాన్ని పరీక్షించడం, పరుగులు తీస్తున్నపుడు ప్రొపల్షన్ సిస్టం పనితీరును పరిశీలించడం, మెట్రో రైలు బ్రేకుల పనితీరు సమర్థవంతంగా ఉందా? లేదా వంటివి క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. మెట్రో రైలు శబ్దం, కూత, కుదుపుల తీరుతెన్నులు ఏ రీతిలో ఉన్నాయో పరీక్షించారు. రైలులో అంతర్గత సమాచార వ్యవస్థ పనితీరు ఎలా ఉందో నిపుణులు సరిచూశారు. రైలు పరుగెడుతున్నపుడు మొత్తం గమనం తీరుతెన్నులను రికార్డు చేశారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులకు సమాచారం అందించే వ్యవస్థ, సీసీటీవీలు, రైలుకున్న హెడ్‌లైట్లు సరిగా ఉన్నాయో? లేదో? పరీక్షించారు. మెట్రో రైలుకు ప్రధానమైన కంప్రెసర్ పని తీరు ఎలా ఉందో చూశారు. రైలు ఆగినప్పుడు, పరుగులు తీస్తున్నపుడు ఆటోమేటిక్ డోర్ల పనితీరును పరీక్షించారు. రైలులో వెంటిలేషన్, ఎయిర్‌కండిషన్ వ్యవస్థ, విపత్తులు సంభవిస్తే రైలులో వివిధ వ్యవస్థల పనితీరు ఎలా వుంటుంది? ప్రయాణికులకు ఏవైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందా? వంటివి తరచి చూశారు. మెట్రో రైల్ రీసెర్చ్ డిజైన్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారం ఉందా? లేదా, ఆసిలేషన్, అత్యవసర బ్రేకుల పనిచేసే విధానం ఎలా ఉంది? అన్న విషయాలు కూడా పరీక్షించారు. సిగ్నలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరును టెస్ట్ చేశారు. ఓవర్‌హెడ్ ట్రాక్షన్ సిస్టం (విద్యుత్ గ్రహించే తీరు), రిలయబిలిటీ (విశ్వసనీయత), అవైలబిలిటీ (సానుకూలత), మెయింటైనబిలిటీ (నిర్వహణ సామర్థ్యం), భద్రతకు సంబంధించిన ఇతర అంశాలు క్షుణ్ణంగా పరిశీలించారు. వీటన్నింటిలో హైదరాబాద్ మెట్రో రైలు పాసైందని, నేడు నిర్వహించే మరికొన్ని పరీక్షల్లో పాస్ కావాల్సి ఉందని ఎల్ అండ్ టీ నిపుణులు, హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు.